డెడికేటెడ్ కమిషన్ కావాలి

డెడికేటెడ్ కమిషన్ కావాలి
  • బీసీ నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ ని డెడికేటెడ్ కమిషన్ గా గుర్తించడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో  ఆర్ కృష్ణయ్య రిట్ పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ ఎస్ నంద ఏకసభ్య ధర్మాసనం ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ను రెండు వారాల్లోగా నియమించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం విద్యానగర్ బీసీ భవన్ లో ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు.

"రాష్ట్ర బీసీ కమిషన్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. బీసీ కమిషన్ ను డెడికేటెడ్ కమిషన్ గా గుర్తింపు ఇవ్వడం సరికాదు. బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక చెల్లుబాటు అవుతుందో లేదో తెలీదు. కాబట్టి ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ నియమించాలి. కార్యాచరణ అత్యంత శాస్త్రీయంగా, ప్రామాణికంగా, హేతుబద్ధంగా, పాదదర్శకంగా జరగాలి. కార్యాచరణను పక్కన పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం అవగాహన రాహిత్యమే’’అని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.